నాగబాబుకి అంత కోపమెందుకొచ్చింది?

Posted on January 08, 2017

మెగసాస్టార్‌ చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు (నాగబాబు) ఆగ్రహావేశాలతో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఊగిపోవడం సినీ పరిశ్రమని షాక్‌కి గురిచేసింది. సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు వ్యక్తులపై నాగబాబు ఆగ్రహం ప్రదర్శించారు. పేర్లు ఆయన డైరెక్ట్‌గా చెప్పకపోయినా, నాగబాబు ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలు, విమర్శలు విసిరారో వారికి అవి గట్టిగా తగిలాయి. ఇద్దరూ వివరణ ఇచ్చారు. ఒకరు మీడియా ముందుకొస్తే, ఇంకొకరు ట్విట్టర్‌లో స్పందించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, ఎప్పుడో ఓ సందర్భంలో తాను రామ్‌చరణ్‌పై చేసిన వ్యాఖ్యలకు నాగబాబు ఇలా స్పందించడం షాక్‌ కలిగించిందనీ, ఏదో పెయిన్‌ హార్టెడ్‌గా ఆయన అలా అని ఉంటారని ఆయన చెప్పారు. అయితే రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం చాలా ఘాటుగా స్పందించారు. నాగబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అంతకు ముందు ట్విట్టర్‌లోనే రామ్‌గోపాల్‌ వర్మ క్షమాపణలు చెప్పారు. ఏమయ్యిందో వెంటనే తేరుకుని తన ట్విట్టర్‌ అక్కౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని చెబుతూ విమర్శల దాడి మొదలు పెట్టారు. ఏదేమైనప్పటికీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన 'ఖైదీ' ప్రీ రిలీజ్‌ వేడుక ఇంత వివాదానికి కారణమవడం సమంజసంగా అనిపించడంలేదన్న వాదనలు వినవస్తున్నాయి. సినీ పరిశ్రమలో గిల్లికజ్జాలు మామూలేనని ఇంకొందరు కూడా అనుకుంటున్నారు. ఈ వివాదం టీ కప్పులో తుపాను అయిపోతే మంచిదే.

Loading...