చంద్రబాబు, పవన్‌ - విడిపోని బంధమిది!

Posted on January 07, 2017

సినీ నటుడు - జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, తెలుగుదేశం పార్టీ అధినేత - ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మధ్య స్నేహం మరింత బలపడటానికి 'ఉద్దానం' ఉపకరించినట్లుగా భావించవలసి ఉంటుందేమో. ఎందుకంటే ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి మద్దతుగా పవన్‌కళ్యాణ్‌ ఇటీవల వెళ్ళారు. అక్కడి పరిస్థితుల్ని చూసి పవన్‌కళ్యాణ్‌ చలించిపోతూ, చంద్రబాబు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ కూడా విధించారు. మిత్రపక్షం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ డెడ్‌లైన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో వివాదానికి ముగింపు పడినట్లే. పార్టీల మధ్య వివాదం పరిష్కారం అయ్యింది అనడం కన్నా ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్య పరిష్కారమవడానికి మార్గం దొరికిందనడం సబబు. పవన్‌కళ్యాణ్‌ సూచనల్ని స్వాగతిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి ఎంపి రామ్‌మోహన్‌నాయుడు, పవన్‌కళ్యాణ్‌ ఉద్దానం పర్యటన అనంతరం చెప్పారు. దానికి తగ్గట్టుగానే టిడిపి ప్రభుత్వం నుంచి చర్యలు ప్రారంభమయ్యాయి. తన డిమాండ్లకు ప్రభుత్వం స్పందించడం పట్ల థ్యాంక్స్‌ చెబుతూ ట్విట్టర్‌లో మెసేజ్‌ని పోస్ట్‌ చేశారు పవన్‌కళ్యాణ్‌. 2014 ఎన్నికల్లో టిడిపికి మద్దతిచ్చిన పవన్‌కళ్యాణ్‌ పలు సందర్భాల్లో గిల్లి కజ్జాలు అయితే పెట్టుకున్నట్లుగా కనిపించారుగానీ, చంద్రబాబు పట్ల అదే స్నేహభావంతో కొనసాగుతున్నట్లు తాజా ఘటనతో అర్థమవుతోంది.

Loading...