వెయ్యి కోట్ల శ్రీవారి ఆదాయం కుబేరుని వడ్డీలోకే !

Posted on January 07, 2017

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో గతేడాది నమోదైనది. తిరుమలేశునికి కానుకల వెల్లువ మరో రికార్డు. 2016 సంవత్సరానికి గాను శ్రీవారిని దర్శించున్నవారు రెండు కోట్ల యాభై లక్షలకు పైనే. గతేడాది చివరి మాసములో ఎనభై ఐదు కోట్ల కానుకలు సమర్పించగా.. మొత్తం సంవత్సరానికి ఒక వెయ్యి పద్దెనిది కోట్ల రూపాయల ఆదాయం హుండీలో కానుకల ద్వారా లభ్యమయ్యిందని, పది కోట్లకు పైగా శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తులకు చేరిందని తితిదే ఈవో సాంబశివ రావు తెలిపారు. ముందరి ఏడాది కంటే గతేడాది ఇరవై లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం వచ్చారని, హుండీ ఆదాయం కూడా నూరు కోట్ల పైగానే వ్యత్యాసం ఉందని తెలిపారు. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక కంపార్ట్ మెంట్లు ఏర్పాటు, భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు నిరంతరాయంగా అందించే ఏర్పాట్లు జరిగాయని, ఈనెల 8న ఉదయం 9గంటలకు తిరువీధుల్లో స్వర్ణరథంపై శ్రీవారి వూరేగింపు, 9న వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయని, 8,9 తేదీల్లో అన్ని అర్జిత సేవలు రద్దు చేసినట్లు చెప్పారు. కనుమ రోజున టీటీడీ అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో గోపూజలు నిర్వహించనున్నట్లు ఈవో సాంబశివరావు తెలిపారు.

Loading...