గాంధీ మాయం: పెద్దనోట్ల రద్దు మాయ !

Posted on January 06, 2017

అనేక అకృత్యాలకు కారణమయ్యే కరెన్సీ నోటు మీద మహాత్మాగాంధీ బొమ్మ ఎందుకు? అనే చర్చ ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ, మహాత్ముడ్ని స్మరించుకోవడం లేదా గుర్తుచేసుకోవడం లేదా ఆయన్ను గౌరవించడం ఈ రకంగా అయినా జరుగుత్నుందుకు ఆనందించేవారు ఎందరో ఉన్నారు. అయితే కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ ఉండరాదనేవారి కల ఫలించింది. గాంధీ బొమ్మ లేకుండా భారత కరెన్సీ వచ్చింది, చెలామణీ కూడా అయిపోయింది. అయితే ఇది కావాలని చేసిందా? సాంకేతిక సమస్యా? అంటే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గాంధీ బొమ్మని తొలగించడానికి ముందుగా వ్యూహంతో ఇలా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. కానీ సాంకేతిక సమస్య కారణంగానే అలా జరిగినట్లు బ్యాంకు అధికారులు ధృవీకరించారు. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన కొత్త కరెన్సీ నోట్లు చాలా వివాదాలను ఎదుర్కొంటున్నాయి. ఒకే కరెన్సీ నోటు మీద రెండు వేర్వేరు సీరియల్‌ నెంబర్లు ఉండటం, అలాగే డిజైన్‌ లోపాలు వంటివి కరెన్సీకి ఉన్న విలువను తగ్గించకపోయినా, దాని గౌరవాన్ని తగ్గించాయి. అలాగే రిజర్వు బ్యాంకు వైఫల్యాన్ని, ప్రభుత్వ అసమర్థతను కూడా ఇవి చాటి చెప్పాయి. అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు తొందరపాటులో ఇలాంటివన్నీ జరిగి ఉండొచ్చు. కానీ ప్రజల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఇటువంటి అంశాల్లోనే ప్రభుత్వాల చిత్తశుద్ధి బయటపడ్తుంది.

Loading...