ఖైదీ ఏడిపించేశాడు !

Posted on January 05, 2017

మెగాస్టార్‌ సినిమా 'ఖైదీ నెంబర్‌ 150'లో మరో ఆడియో సింగిల్‌ రిలీజ్‌ అయ్యింది. ఇంతవరకూ వచ్చిన పాటలన్నీ జోష్‌ఫుల్‌గా ఉండగా, ఈ పాట మాత్రం అందుకు భిన్నంగా చాలా సెంటిమెంట్‌తో కూడుకున్నదిగా ఉంది. రైతు కష్టాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకూ వచ్చిన పాటలేమీ ఆ విషయాన్ని ధృవీకరించలేదు. క్లాస్‌, మాస్‌ ఇలా రకరకాలుగా ఆకట్టుకున్నాయి. ఈ పాట వింటుంటే మాత్రం పక్కాగా తెలిసిపోతోంది. చిరంజీవి ఎందుకు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడనేది. వయసుకు తగ్గట్లుగానే ఈ సినిమాతో జనానికి మంచి మెసేజ్‌ ఇవ్వదలచుకున్నాడు చిరు అని తెలుస్తోంది. పాట మాత్రం కంట తడి పెట్టించేస్తోంది. వినాయక్‌ చిరంజీవిని జనం మనిషిగా ఎలా చూపించి ఉంటాడో ఈ సినిమాలో అని ఫ్యాన్స్‌లో ఆరాటం మరీ ఉబకి వస్తోంది ఈ పాటతో. 'నీరు నీరు నీరు రైతు కంట నీరు..' అంటూ రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలో రైతు కష్టాలను కళ్లకు కట్టినట్లు తెలిపారు. మొత్తానికి ఇంతవరకూ వచ్చిన పాటలన్నీ ఒక ఎత్తు. ఈ పాట ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లుగా ఉంది. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాకు మ్యూజిక్‌ దేవిశ్రీ ప్రసాద్‌ అంందించారు. సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 7న సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరగనుంది. గుంటూరులోని హాయ్‌లాండ్‌ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.

Loading...