ఎన్ని నాలుకలు కోశారేంటీ?

Posted on January 04, 2017

రాజకీయాల్లో విమర్శలు సహజం, ప్రతి విమర్శలు అంతకన్నా సహజం. విమర్శలు, ప్రతి విమర్శలు లేకపోతే ఇప్పటి రాజకీయాల్ని ఊహించుకోలేం. సద్విమర్శలకు కాలం చెల్లింది. అందుకే నోటికొచ్చినట్లల్లా మాట్లాడితేనేగానీ రాజకీయ నాయకులం కాలేమనే భావన రాజకీయ నాయకుల్లో పెరిగిపోయింది. తద్వారా రాజకీయ విమర్శలకూ హద్దులు చెరిగిపోయాయి. కుల రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ని ఉద్దేశించి టిడిపి ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా, వాటిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా స్పందించింది. జెసి దివాకర్‌రెడ్డిని జానీవాకర్‌ రెడ్డిగా అభివర్ణించారు ఆ పార్టీ నాయకులు. అంతే కాకుండా ఇకపై ఎప్పుడైనా జగన్‌పై విమర్శలు చేస్తే నాలుక కోసేస్తామని హెచ్చరించడం జరిగింది. 'నాలుకలు తెగ్గోస్తాం' అనే మాట రాజకీయాల్లో మామూలే. అయితే అలా ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుడి నాలుకనీ ఇంకో నాయకుడు తెగ్గోసిన సందర్భాల్లేవు. ఈ రోజు తిట్టిన నోటితోనే రేపు మహా నాయకుడని ప్రశంసిస్తుంటారు. ఒకానొక కాలంలో జెసి దివాకర్‌రెడ్డి, చంద్రబాబుని విమర్శించారు. అదే జెసి దివాకర్‌రెడ్డి అప్పట్లో జగన్‌ని ప్రశంసించారు కూడా. కాలం మారింది. 2019 ఎన్నికల నాటికి జెసి దివాకర్‌రెడ్డి గనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో చేరితే, ఈ విమర్శలన్నీ ఆనాడు వినిపిస్తాయా? వినిపించవుకదా. అలాంటప్పుడు నాలుకలు తెగ్గోసుకోవడమెందుకుట?

Loading...